దేవాలయ భూముల కుంభకోణం గురించి ముఖ్యమంత్రికి ముందే తెలుసు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుసు. మంత్రి సత్యనారాయణరావుకూ తన శాఖ అవినీతి బండారం గురించి మంత్రి పదవి చేపట్టక ముందు నుంచే తెలుసు. తన శాఖలో జరిగిన `మేజర్ స్కామ్'కు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి సత్యనారాయణరావు రాజీనామాచేస్తారని ప్రజలందరికీ తెలుసు. దానిని ముఖ్యమంత్రి తిరస్కరిస్తారని బాగా తెలుసు. ఎంతో నాటకీయతతో రాజీనామా, తిరస్కారం, శాఖ మార్పు తతంగాన్ని కాంగ్రెస్ సర్కార్ నడిపించేసింది. ఎ.సి.బి. దాడులు జరిపించేశామని, రిటైర్‌డ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తున్నామని ప్రకటించి కథను సుఖాంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియనిది ప్రజలకు తెలిసింది ఒకటుంది. అదే ప్రజా చైతన్యం. తన భూముల్ని ఎలా కాపాడుకోవాలో ఆ దేముడికి తెలియదని కాంగ్రెస్ గుడ్డి ప్రభుత్వం భ్రమల్లో ఉంది. దేముడికి శఠగోపం పెట్టటం తమకు తెలిసిన విద్య మాత్రమేనని మురిసిపోతోంది. ప్రజలను కొంత కాలం మోసం చేయవచ్చు. ఎల్లకాలం కాదు సుమా. ప్రజా చైతన్య కెరటాలు సునామీ స్పీడుతో అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుడిచి పెట్టే రోజు అతి దగ్గరలో ఉంది. దేముడి భూములను కాపాడుకొనే శక్తి, యుక్తి ప్రజలకుందన్న విషయాన్ని విస్మరించి వ్యవహరించవద్దని తెలుగుదేశం హెచ్చరిస్తోంది

దేవాలయ భూముల విక్రయ కుంభకోణం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇది బీహార్‌లో పశుగ్రాస కుంభకోణాన్ని మించిన అవినీతిపర్వంగా రూపుదాల్చింది. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలో పూర్తిగా ఇరుక్కుపోయాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారపార్టీ శాసనసభ్యులతోపాటు సీనియర్ ఉన్నతాధికారుల ప్రమేయం సైతం ఇందులో వినిపిస్తోంది. పట్టణ ప్రాంతాలలోని సుమారు 400 ఎకరాల ఆలయ మాన్యాలు అధికారపక్ష అవినీతివల్ల అన్యాక్రాంతం అయిపోయాయి. వీటి విలువ కొన్ని వందల కోట్ల రూపాయల మేరకు ఉంటుందని అంచనా. ఈ అవినీతి బండారం బయటపడినప్పటి నుంచి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తవ్వినకొద్దీ అక్రమాలు కొత్తకొత్తవి వెలుగులోకి వస్తున్నాయి.
ఈ భూముల కుంభకోణం చిలికి చిలికి గాలివాన అయినట్లు మొత్తం ప్రభుత్వాన్ని, పాలకపక్షాన్ని వివాదపు రొంపిలోకి నెట్టేసింది. ఏతావాతా అనుమానాలు, సందేహాలు అంతకంతకూ పెరిగి ఆరోపణల అస్త్రాలు ముఖ్యమంత్రిపైకే సంధించే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే ప్రభుత్వం సవ్యంగా మెలగడంతోపాటు అందుకవసరమైన నమ్మకాన్ని కూడా కలిగించాలి. ప్రభుత్వాధినేత వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి నిర్ణయం ప్రభుత్వ విశ్వసనీయత పెంచేదిగా ఉండాలి. ఈ విజ్ఞత ముఖ్యమంత్రిలో లోపించటం దురదృష్టకరం. మంత్రి సత్యనారాయణరావు తాను ఈ కుంభకోణానికి అతీతుడు అంటూ మాట్లాడుతున్నారు.
అవినీతి, ఊటలు దిగిన మర్రి వృక్షంలా పాతుకుపోయినా మాకేం తెలియదని కాంగ్రెస్ నేతలు నమ్మబలుకుతున్నారు. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడన్న నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఒంటపట్టించుకొన్నట్లుంది. అందుకే దేవాదాయ భూముల కుంభకోణంలో పాత్రధారులుగా అనుమానితులైన పెద్ద చేపల ఆచూకీ కనిపెట్టేందుకు పకడ్బందీ దర్యాప్తు చేయించటంలేదు. తూతూ మంత్రంగా విచారణ జరిగిందని అనిపించి అవినీతి తిమింగలాలను భద్రంగా రక్షించేందుకు ఉబలాటపడుతోంది. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో కేంద్ర నేరపరిశోధన బృందం (సీబీఐ) ద్వారా విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. అలా చేస్తేనే ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి మాటకు విలువ ఉంటుంది. నిష్పాక్షికమైన విచారణ వల్లే దేముడినే నిలువు దోపిడీ చేసేందుకు ఉపక్రమించిన పెద్దల గోత్రనామాలు వెల్లడి అవుతాయి.
అసలు దోషూలెవరు?
దిక్కులేని వారికి దేముడే దిక్కంటారు. అలాంటి దేముళ్ళకీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దిక్కు లేకుండా పోయింది. దేముడిని, దేముడు ఆస్తులను కాపాడాల్సిన అధికారులు, బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న పెద్దలు అడ్డదారులు తొక్కి దేముడి భూములను అక్రమంగా కారుచౌకగా విక్రయించేందుకు పూనుకొంటే ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ దేముడు భూములు ఎక్కడ ఉన్నాయి? ఎలా ఆక్రమించుకొని సొము్మ చేసుకోవాలన్న దురాలోచనతో అనేకమంది పట్టణ, నగర ప్రాంతాలలోని భూములపై కన్ను వేశారు. అయిదు నెలల్లో రిటైర్ కాబోతున్న ఐ.ఎ.ఎస్. అధికారిని ఏరికోరి దేవాదాయశాఖ కమిషనర్‌గా తెచ్చుకున్నారు. ఆయన ద్వారా దేవాదాయ ధర్మాదాయ చట్టంలోని సెక్షన్89 ప్రకారం కమిషనర్‌కు ఉండే విస్తృతాధికారాలను వినియోగించుకొని దేముడి భూములను కాజేసేందుకు కుట్ర చేశారు. రంగారెడ్డి జిల్లా దేవరయాంజల్ సీతారామస్వామి ఆలయానికి చెందిన అత్యంత విలువైన భూములను కాజేయటానికి రంగం సిద్ధం చేశారు. భూముల క్రమబద్ధీకరణకు ఫైళ్ళను నడిపించారు. ఈ అక్రమ క్రమబద్ధీకరణలను నిలుపు చేస్తూ మంత్రి సత్యనారాయణరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత మే 16వ తేదీన గుట్టు చప్పుడు కాకుండా తానిచ్చిన నిషేధ ఉత్తర్వులను మంత్రి సత్యనారాయణరావు ఉపసంహరించుకుంటూ ఫైలుపై సంతకం చేశారు. తానిచ్చిన ఆదేశాలనే ఉపసంహరించుకునేలా మంత్రిపై ఎవరి వత్తిడి తెచ్చారు? దీని వెనుక ఉన్న ప్రచ్ఛన్న హస్తాలు ఎవరివి? అప్పటికే బదిలీ ఆదేశాలను అందుకున్న దేవాదాయ వ్యవహారాలను పర్యవేక్షించే రెవెన్యూ కార్యదర్శి జె.పి.మూర్తిని మరో వారం అదే పోస్టులో కొనసాగి పనులన్నీ చక్కబెట్టేందుకు ఎవరు అవకాశం కల్పించారు. మే 31వ తేదీకి రిటైర్ అవుతున్న కమిషనర్‌కు, బదిలీ ఆదేశాలు అందుకున్న జె.పి.మూర్తి కుమ్మకై్క దేవాలయ భూముల అక్రమ విక్రయ కథ నడిపించారు. చకచకా ఫైళు్ళ కదిలాయి. మార్కెట్ ధర నిర్ణయించే విషయంలో కూడా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను పక్కన పెట్టి నేరుగా సబ్ రిజిస్ట్రార్, ఎం.ఆర్.వో.లతో సంప్రదింపులు జరిపి ఆఘమేఘాలపై పనులు చక్కబెట్టేశారు. అయిదు రోజుల్లో కోట్లాది రూపాయల దేముడి భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. ఈ కుంభకోణం బయటపడినప్పటి నుంచి మంత్రి సత్యనారాయణరావు పోషించిన పాత్ర కూడా ఎన్నో అనుమానాలకు, సందేహాలకు తావిచ్చింది. వ్యవహారం వెల్లడి కాగానే కంచే చేను మేసిందన్నారు. తాను సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడు కేశవరావు ఒత్తిడి వల్లే తాను ఆదేశాలు ఇవ్వవలసి వచ్చిందని వాపోయారు. ఆ తర్వాత అది కూడా సరికాదన్నారు. మాటలు మార్చుకొంటూ పోయారు. పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. చివరకు ఇదంతా పత్రికల సృష్టే అన్నారు. చివరకు నెపం వారు తెలుగుదేశం పైనే నెట్టేశారు. తెలుగుదేశం హయాంలోను చాలా జరిగాయంటూ ఎదరు దాడికి దిగారు. గత పది సంవత్సరాలుగా జరిగిన దేవాలయ విక్రయాలను న్యాయ విచారణ పరిధిలోకి చేరుస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇలా యధేచ్ఛగా భూముల విక్రయాన్ని ఎన్నడూ అనుమతించలేదు. ఎటువంటి విచారణనైనా తెలుగుదేశం స్వాగతిస్తోంది. తెలుగుదేశంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు గురివిందగింజ సామెతను గుర్తు చేస్తున్నాయి.
కమిషనర్ వెంకటేశ్వర్లు పాత్ర
ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్‌గా ఐ.ఎ.ఎస్. అధికారి ఐ.వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన పదవీ విరమణ చేసేంతవరకు రాష్టవ్య్రాప్తంగా క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 350 ఎకరాల భూమిని విక్రయించేశారు. రంగారెడ్డి, హైదరాబాద్, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప, మెదక్ జిల్లాలలోని భూములు విక్రయం జరిగింది. వెంకటేశ్వర్లు కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సచివాలయంలో ఉన్నతస్థాయి అండదండలు లభించటంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా జరిగింది. కొద్ది వారాల్లో పదవీ విరమణ చేస్తారనగా వెంకటేశ్వర్లు ఆలయ భూముల విక్రయాలకు సంబంధించి వివిధ ఆలయాలకు చెందిన సుమారు 350 ఎకరాల భూమిని అమ్మటానికి ఆయన హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టంలోని 89 అధికరణ ద్వారా తనకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకున్నారు. 14 ఆలయాలు, రెండు ట్రస్టులకు చెందిన 41 కేసులను పరిష్కరించారు. ఈ విక్రయ ఆదేశాల వల్ల దేవాదాయశాఖకు సమకూరింది రూ.12 కోట్లు మాత్రమే. వాస్తవ విలువ రూ.520 కోట్లు ఉంటుందని అంచనా. భూముల కుంభకోణం గుట్టు రట్టవడంతో ప్రభుత్వం నెమ్మదిగా చర్యలు మొదలెట్టింది. దేవాదాయశాఖ కమీషనర్ కార్యాలయంపై దాడి చేసిన ఎ.సి.బి. అధికారులు ముఖ్యమైన 30 ఫైళ్ళను స్వాధీనం చేసుకున్నారు. (మే 28, 2005) ఎసీబీ స్వాధీనం చేసుకొన్న ఫైళ్ళలో అక్రమ భూముల విక్రయ వివరాలు...
మంత్రి సత్యనారాయణరావు అమాయకుడట...
దేవాదాయ శాఖలో కోట్ల రూపాయల విలువైన భూములను ఎడాపెడా విక్రయించారు. అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇష్టానుసారం పదోన్నతులు కల్పించారు. ఇవేమీ దేవాదాయశాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావుకు తెలియదట. దేవాదాయశాఖ పరువును రోడ్డున పడేసిన భూ కుంభకోణంపై అయిదుగురు క్రిందిస్థాయి అధికారులను సస్పెండ్‌చేసి మంత్రి చేతులు దులుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా దేవరయాంజల్‌లోని ఆలయ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా మంత్రి స్వయంగా నిషేధం విధించారు. కానీ దేవాదాయశాఖ మాజీ కమీషనర్ వెంకటేశ్వర్లు యధేచ్ఛగా ఈ భూములను విక్రయించారు. రిజిస్ట్రేషన్‌పై నిషేధం కూడా తొలగిపోయింది. ఆ ఫైలుపై కూడా మంత్రే సంతకం పెట్టారు. భూముల రిజిస్ట్రేషన్‌కు కమిషనర్ అనుమతి ఇస్తున్నారని మంత్రికి చాలామంది ఫిర్యాదులు చేశారు. కానీ ఆయన తగిన విధంగా స్పందించలేదు. వీసమెత్తు చర్యలు కూడా తీసుకోలేదు. శాఖాపరంగా సమగ్ర దర్యాప్తు చేయించేందుకు ప్రయత్నం చేయలేదు. దేవాలయ భూములు తమకు విక్రయించేలా చూడండంటూ అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు విజ్ఞాపన పత్రాలు అందజేయగానే మంత్రి సత్యనారాయణరావు ``తగిన చర్యలు తీసుకోండి...'' అని సిఫార్సు చేశారు. ఇటువంటి 14 కేసులను సిఫార్సు చేసినట్లు మంత్రే స్వయంగా తెలిపారు. వీటిలో ఒకటి పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావుది కూడా ఉన్నదని మంత్రి మండలి సమావేశంలో వివరించడమే కాకుండా ఆ విషయాన్ని పత్రికల వారికి కూడా తెలిపారు. వివాదం ముదరడంతో పీసీసీ అధ్యక్షుడు నోటి మాటగా చెప్పారని సత్యనారాయణరావు మాట మార్చేశారు. మిగిలిన 13 దరఖాస్తులు ఎవరివన్నవి ఇంకా వెల్లడి కాలేదు. ఇందులో ముఖ్యమంత్రి బంధువుల నుంచి పలువురు మంత్రులు, శాసనసభ్యుల సిఫార్సు లేఖలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా మంత్రికి తెలిసే జరిగిందన్నది వాస్తవం. ఒక పక్క అవినీతి నిరోధక శాఖ, దర్యాప్తు మరొక పక్క న్యాయ విచారణ ఆదేశించిన ముఖ్యమంత్రి వివాదానికి కేంద్ర బిందువైన మంత్రి సత్యనారాయణరావుకు క్లీన్‌చిట్ ఇవ్వడం ఆశ్చర్యకరం. న్యాయ విచారణ ఫలితం కోసం వేచి చూడకుండా పిల్లికి ఎలుక సాక్ష్యంలాగా ముఖ్యమంత్రి పనికిమాలిన కితాబులివ్వటం ఈ మొత్తం స్కాంలో కీలక అంశం. అధికారులు ఎంత అవినీతిపరులైనా ఫైలుపై మంత్రి సంతకం లేకుండానే భూముల క్రమబద్ధీకరణ జీవోలు వచ్చాయా? దేముడి మాన్యాలను ధారాదత్తం చేసేందుకు అనేక జీవోలు జారీ అయ్యాయి. అక్రమాలకు మూల కారణమైన జీవోలన్నీ మంత్రికి ఎలాంటి సంబంధం లేకుండానే వాటికవి పుట్టుకొచ్చాయా... కోట్లాది ఆస్తుల విక్రయానికి సంబంధించిన కీలక ఉత్తర్వులపై మంత్రి కళు్ళ మూసుకొని గుడ్డి సంతకాలు పెట్టారా? ఇంతటి బాధ్యతారాహిత్యానికి పాల్పడిన మంత్రిని ముఖ్యమంత్రి ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు. ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తి తనను తప్పుదోవ పట్టించారని చెప్పుకున్న మంత్రి అదే అధికారిని బదిలీ అయ్యాక కూడా తిరిగి అదే శాఖకు తెప్పించుకోవటానికి ఎందుకు నానా తంటాలు పడవలసి వచ్చింది? తన శాఖలో అవినీతి మెండుగా ఉందని శాసనసభలో గొంతెత్తి ఘోషించిన మంత్రి అవినీతి తిమింగలాలను కనిపెట్టి లంచగొండులను అణచే విషయంలో అప్రమత్తత ఎందుకు చూపలేదు? తన శాఖమీదే తనకు అదుపు లేనివాడు మంత్రి పదవికి ఎలా అర్హుడు? కోట్లాది రూపాయల నష్టానికి కారణమైన స్కామ్‌కు సంబంధిత మంత్రికి పూచీ లేదంటే మరి ఎవరిది బాధ్యత? ఈ బాధ్యత నుంచి ముఖ్యమంత్రి ఎలా తప్పించుకుంటారు?
కమీషనర్ వెంకటేశ్వర్లు దేవాలయ భూములు అక్రమంగా విక్రయిస్తున్నారని రెండు నెలల క్రితమే మంత్రికి ఫిర్యాదులు అందాయి. దీనిపై కమిషనర్‌ను ఎందుకు వివరణ కోరలేదు? దీనిపై అప్పుడే విచారణ ఎందుకు చేయలేదు? దేవాదాయ శాఖలో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత శాఖాపరంగా ఎందుకు సమగ్ర దర్యాప్తు చేయించలేదు? రంగారెడ్డి జిల్లా దేవరయాంజల్ ఆలయ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా మంత్రే స్వయంగా నిషేధం విధించారు. కాని కమీషనర్ యధేచ్ఛగా భూములు విక్రయించారు. మంత్రే ఈ ఫైలుపై సంతకం పెట్టారు. మే నెలలో భూముల విక్రయం నిషేధం ఎత్తివేతకు సంబంధించి ఫైలు మంత్రి వద్దకు వచ్చింది. ఈ ఫైలును ముఖ్య కార్యదర్శి రూపొందించారు. దీనిపై ముందు వెనుక చూడకుండా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తపరచకుండా, వివరణ కోరకుండా మంత్రి సంతకం పెట్టేశారు. భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా తనే నిషేధం విధించిన సంగతి తెలిసి కూడా పీసీసీ అధ్యక్షుని సిఫార్సు లేఖపై తగిన చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పవలసి వచ్చింది? మంత్రి సిఫారసు ఆధారంగా రిజిస్ట్రేషన్ నిషేధ ఉత్తర్వు ఎత్తివేత ఫైలు కూడా కదిలిన మాట వాస్తవం కాదా? తాను విధించిన నిషేధాన్ని మంత్రి ఎత్తివేశారు. పైగా 50 వేలకు పైగా దేవాలయ భూములను విక్రయిస్తానని, ఎమ్మెల్యేలు నియమించిన కమిటీ భూముల రేట్లు నిర్థారిస్తుందని మంత్రి చేసిన ప్రకటనలో ఆంతర్యం ఏమిటి? దీన్నిబట్టి ఈ మొత్తం గోల్‌మాల్ మంత్రికి తెలియకుండా జరగలేదు. పీసీసీ అధ్యక్షుడు కేశవరావు చెప్పిన పైరవీని పురస్కరించుకుని కొన్ని భూముల అమ్మకం వ్యవహారం చూడమని తానే అధికారులకు పురమాయించానని మంత్రి సత్యనారాయణరావే స్వయంగా చెప్పారు. దేవుడి మాన్యాల బదలాయింపులపై నిషేధం అడ్డు వస్తుందని అధికారులు సూచించగా తానే నిషేధాన్ని సడలించమని ఆదేశించానని సత్యనారాయణరావు అంటున్నారు. ఈ లెక్కన ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సత్యనారాయణరావే కదా! ఈ కుంభకోణంలో నా తప్పులేదు... పీసీసీ అధ్యక్షుడి తప్పు అంతకంటే లేదు. ప్రిన్సిపుల్ సెక్రటరీ తప్పు లేదు... అని మంత్రి బుకాయించడం దారుణం. తప్పు చేసిన మంత్రే తాను అపరాధినని చెప్పుకోవడం.. ఇందుకు ముఖ్యమంత్రిగారు తలూపడం వింతల్లోకెల్లా వింత. భూ విక్రయాల గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ యధార్థమని, అధికారులు తనను తప్పుదారి పట్టించారని మంత్రి సత్యనారాయణరావు మంత్రివర్గ సమావేశంలోనే వాపోయారు. ఈ అడ్డగోలు పందేరాలకు తలుపులు బార్లా తెరిచింది మంత్రే అయినప్పుడు జరిగిన తప్పిదానికి జవాబుదారీ ఆయనది కాకపోతే మరెవరిది? మంత్రి చేస్తున్న వితండవాదాన్ని ముఖ్యమంత్రి సమర్థించడం, ఈ అక్రమాలతో మంత్రికేమీ సంబంధంలేదని చెప్పడం, రాజీనామాను బుట్టదాఖలు చేయడం, మంత్రి శాఖను మార్చటం కాంగ్రెస్ రాజకీయ నయవంచనలో భాగమే. ముఖ్యమంత్రి, మంత్రి సత్యనారాయణరావు ఎవరికివారు తాము సచ్చీలురైనట్లు ప్రకటించుకున్నప్పుడు మరి ఈ విచారణలు, దర్యాప్తులెందుకో! నిజానిజాలు తెలియవలసింది న్యాయ పరీక్షలో... కనీసం న్యాయ విచారణ పూర్తయ్యేవరకు మంత్రి పదవి నుంచి సత్యనారాయణరావును తప్పించి ఉంటే వాస్తవాలు బయటపడేవి. అంతవరకు వేచి ఉండే ఓపిక లేకుండా పిల్లికి ఎలుక సాక్ష్యమన్నట్లుగా మంత్రి వాదనను ముఖ్యమంత్రి సమర్థించడం, పనికిమాలిన కితాబులివ్వడం గమనిస్తే ఈ భారీ స్కాంలో ముఖ్యమంత్రి పాత్ర, ఆయన కుటుంబ సభ్యుల నిర్వాకం, మంత్రిగారి కుమారుడి అవినీతి చేష్టలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నాయకులు, మంత్రులు, ఎంపీలు ప్రచ్ఛన్న హస్తం ఎక్కడ బయటపడుతుందన్న ఆదుర్దా, భయం వ్యక్తమవుతోంది.
కమీషనర్ అవినీతి మంత్రికి తెలియదా!
గత కొన్నేళు్ళగా ప్రాధాన్యతలేని పోస్టులకే పరిమితమైన వెంకటేశ్వర్లు దేవాదాయశాఖ కమీషనర్‌గా నియమించటంలో ఎవరి ప్రమేయం ఉంది? ఆయన పదవీ కాలంలో అనేక ఆరోపణలు గుప్పుమన్నా ఎటువంటి చర్య ఎందుకు తీసుకోలేదు. పదవీ విరమణ ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు? కమీషనర్‌గా వెంకటేశ్వర్లు ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. మే 31న పదవీ విరమణ చేశారు. ఈ 5 నెలల్లో 350 ఎకరాల భూమిని అమ్మేశారు. వెంకటేశ్వర్లును దేవాదాయశాఖ కమీషనర్‌గా తీసుకురావడంలో ప్రధానపాత్ర పోషించిందెవరు? గతంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా ఏరికోరి ఈ పదవిలో నియమించిందెవరు? వెంకటేశ్వర్లు నియామకంలో మంత్రి సత్యనారాయణరావు కుటుంబసభ్యుల పాత్రపై అనేక కథనాలు వినవస్తున్నాయి. కొద్ది కాలంలో రిటైర్ అయ్యే అధికారిని దేవాదాయ కమీషనర్‌గా నియమించడం వెనుక పెద్ద ఎత్తున సొము్మలు చేతులు మారినట్లు కూడా ఆరోపణలు వినవస్తున్నాయి. అప్పట్లో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన జె.పి.మూర్తి, దేవాదాయశాఖ కమీషనర్ వెంకటేశ్వర్లుకు మధ్య ఉన్న సంబంధమేమిటి? వీళ్ళిద్దరూ కూడబలుక్కుని వ్యవహారం నడిపినట్లు మంత్రి సత్యనారాయణరావు ఆరోపిస్తున్నారు. దేవాదాయ భూముల క్రమబద్ధీకరణ ఫైలుపై మంత్రి సంతకం చేసిన తరువాతే జీవోలు విడుదలయ్యాయి కదా. దేవాదాయ భూముల కుంభకోణానికి బాధ్యులైన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా కొము్మ కాస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదా?
సత్యనారాయణమూర్తిని ఎందుకు బదిలీ చేశారు?
వెంకటేశ్వర్లు కంటే ముందు దేవాదాయశాఖ కమీషనర్‌గా వ్యవహరించిన సత్యనారాయణమూర్తిని ఎందుకు బదిలీ చేయవలసి వచ్చింది? తమకు అనుకూలంగా వ్యవహరించటంలేదన్న కారణంతో మంత్రి సత్యనారాయణరావు అప్పట్లో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె.పి.మూర్తిపై ఒత్తిడి తెచ్చి సత్యనారాయణమూర్తిని బదిలీ చేసిన మాట వాస్తవం కాదా? కొత్త ఉద్యోగుల నియామకం, భూముల అమ్మకం, ఉద్యోగుల బదిలీ, పదోన్నతుల వ్యవహారంలో మంత్రి సత్యనారాయణరావు కుటుంబీకుల ప్రమేయాన్ని సత్యనారాయణమూర్తి వ్యతిరేకించడంవల్లే ఆయనను బదిలీ చేశారా?
జె.పి.మూర్తిపై అంత మక్కువ ఎందుకు?
దేవాలయ భూముల కుంభకోణంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తి ఇంటిపై అవినీతిశాఖ అధికారులు దాడులు జరిపారు. దాడులలో ఏ సమాచారం లభించింది. సోదా చేసిన వస్తువులు, లభించిన సమాచారంపై ఎందుకు పంచనామా జరపలేదు. ప్రభుత్వం ఆయనపై ఇంతవరకు ఎటువంటి చర్య ఎందుకు తీసుకోలేదు. దేవాలయ భూముల అక్రమాలపై ఎ.సి.బి. విచారణ జరుగుతుండగానే ఆయన విదేశాలకు వెళ్ళేందుకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చిం తర్వాత ఆయన ఇంటిపై ఎ.సి.బి. దాడి జరిపింది. ఎ.సి.బి. దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం జె.పి.మూర్తిని హోంశాఖ ముఖ్య కార్యదర్శి పదవి నుంచి ఎందుకు తప్పించలేదు. ఆయనపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. దేవాదాయశాఖామంత్రి సత్యనారాయణరావుకు న్యాయ విచారణ మొదలు కాకుండానే క్లీన్ చిట్ ఇచ్చి శాఖ మార్చి సీఎం హోంశాఖ ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తిపై ఇంకా ఎందుకు మమకారంతో ఉన్నారు. ఒక పక్క ఎ.సి.బి. విచారణ, మరో పక్క న్యాయ విచారణ జరుగుతుండగా ఆయన లాంగ్ లీవ్‌లో వెళ్ళేందుకు ఎందుకు అనుమతించారు?
ఈ వ్యవహారంలో వాస్తవాలు ఇలా ఉన్నాయి...
దేవాదాయ భూముల విక్రయ కుంభకోణం వ్యవహారంలో మంత్రి సత్యనారాయణరావు వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు, వార్తా కథనాలు ఇలా ఉన్నాయి... నా శాఖలో భూముల కుంభకోణం చోటు చేసుకోవడం, దుర్మార్గాలకు నెలవుగా మారటంపట్ల దేవాదాయశాఖ మంత్రిగా సిగ్గుపడుతున్నాను'', ``మా శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్షన్ 89 కింద ఒనగూడిన అధికారాలపై స్టే ఇవ్వాలని ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తిని కోరాను. ఇచ్చానని నాతో ఆయన అబద్ధం చెప్పారు. దానివల్లే భూముల విక్రయంలో అక్రమాలు జరిగాయి'' ``246 ఎకరాలు తక్కువ ధరకు విక్రయించినట్లు మా దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతోందని నాతో చెప్పారు.'' దేవాలయ భూములకు సంబంధించిన వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు దేవాదాయ శాఖామంత్రి తన పర్సనల్ సెక్రటరీ మల్లారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మకాలపై స్టే ఇవ్వమని ముఖ్య కార్యదర్శికి చెప్పి ఆ రకంగా ఆర్డర్లు వచ్చేటట్లు చూడమని మంత్రి పీఎకు చెప్పారు. కానీ మల్లారెడ్డి ఎటువంటి ఉత్తర్వులు తీసుకు రాలేదు అన్నారు. ``అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు అందిన తర్వాత చర్య'' తీసుకుంటమని అప్పటి సీయం వైయస్ అన్నారు. అవినీతి నిరోధక శాఖ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాకు అందజేసింది. ఈ నివేదికలో ఐ.ఎ.ఎస్. అధికారులను తప్పుపట్టింది. ఈ వాస్తవాలను పరిశీలించి చూస్తే మంత్రి సత్యనారాయణరావుకు కుంభకోణంలో పాత్ర ఉందన్న విషయం స్పష్టమవుతోంది. వ్యవహారం అంతా బయటపడ్డాక మంత్రి సత్యనారాయణరావు రాజీనామా చేసినట్లు ప్రకటించడం, ముఖ్యమంత్రి ఆ రాజీనామాకు తిరస్కరించడం, హైకోర్టు రిటైర్‌డ జడ్జితో విచారణకు ఆదేశించడం అంతా హైడ్రామాలో విభిన్న అంకాలు. నిజంగా ప్రభుత్వానికే కనుక సమస్య తీవ్రత పట్ల సరైన అవగాహన, అవకతవకలను అరికట్టి తీరాలన్న పట్టుదల ఉంటే కమిషనర్‌కు పూర్తి అధికారాలు ఇచ్చి ఉండేది కాదు. అంతకు ముందు అవినీతి కుంభకోణం జరగడానికి దారితీసిన పరిస్థితులు, ఆలయ భూముల విక్రయంపే నిషేదం ఎందుకు జారీ చేయవలసి వచ్చింది, తిరిగి నిషేదాన్ని ఎందుకు తొలగించవలసి వచ్చింది. మొదలగు సందేహాలపై ప్రజలకు వాస్తవాలు తెలియవలసి ఉంది. పిసిసి అధ్యక్షుడు కే.కేశవరావు కొన్ని భూముల విక్రయానికి సంబంధించి వచ్చిన దరఖాస్తులను మంత్రి పరిశీలనకు పంపించడం, మంత్రి ఈ దరఖాస్తులను పరిశీలించి తగు చర్య తీసుకోమని ఆదేశించడం గమనిస్తే ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది ఉన్నత స్థాయి నాయకుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దేవాలయ భూముల విక్రయం, రిజిస్ట్రేషన్‌పై అంక్షలు విధిస్తూ 2004 అక్టోబర్ 14వ తేదీన 810 జి.ఓ జారీ చేశారు. 2005 మే 16వ తేదీన ఈ జి.ఓను ఉపసంహరించుకున్నారు. నిషేదం ఉత్తర్వు అమలులో ఉండగానే భూముల విక్రయాలు జరిగిపోయాయి. భూమి మార్కెట్ విలువను జిల్లా కలెక్టర్ నిర్థారించవలసి ఉండగా ఎమ్మార్వో నుంచి భూమి విలువపై సిఫార్సులు తెప్పించుకుని ఆ మేరకు విక్రయాలు చేసేశారు. తాను బదిలీ అవుతున్నట్లు తెలిసి కూడా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జె.పి. మూర్తి నిషేదం తొలగింపు ఉత్తర్వులను మంత్రి ముందు పెట్టి సంతకం చేయించారు. ముఖ్య కార్యదర్శి అదే శాఖలో మరికొన్ని రోజులు కొనసాగేందుకు మంత్రి సత్యనారాయణ రావు సిఫార్సు చేశారు. దేవాదయ కమీషనర్ స్థాయిలో భూముల విక్రయాలలో అవకతవకలు జరుగుతున్నట్లు మంత్రి సత్యనారాయణ రావుకు నెల రోజుల ముందే తెలిసిన అక్రమాలకు అడ్డుకట్ట వేయలేదు. దేవుడి భూములను విచ్చలవిడిగా విక్రయించిన కమీషనర్ హాయిగా పదవీ విరమణ చేసేందుకు ప్రభుత్వమే వెసులుబాటు కల్పించింది. దేవాదాయ కమీషనర్‌కు పెద్ద ఎత్తున అండదండలు అందించిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర ఉన్నతాధికార్ల మీద ఎటువంటి చర్య తీసుకోకుండా చిన్న అధికార్లను సస్పెండ్ చేసి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. అసలు గజ దొంగలను, ఎవరి జవాబుదారీ లేకుండా వ్యవహరించిన అధికార్లపై ఎటువంటి చర్యలు లేవు. దేవాదాయ, ధర్మాదాయ శాఖలో వందల కోట్ల రూపాయలలో జరిగిన అధికార దుర్వినియోగానికి మంత్రి సత్యనారాయణ రావు నైతిక బాధ్యత వహించక తప్పదు. కుంభకోణం బయటపడ్డా్ట మంత్రి జరిగిన దానికి సిగ్గుపడుతున్నానని చెప్పడం అవివేకం.
దిక్కులేని దేవుడి ఆస్తులు
రాష్ట్రంలో 32 వేల దేవాలయాలు ఉంటే వాటిలో సుమారు 21 వేల గుళ్ళకు చెప్పుకోదగిన మాన్యం లేదు. పదకొండు వేల దేవాలయాలకు భూములు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 లక్షల 76 వేల ఎకరాల భూములు గుడి మాన్యాల కింద ఉన్నాయి. ఇందులో 77,182 ఎకరాలు మాగాణి; 2.22 లక్షల ఎకరాలు మెట్ట; 5,562 ఎకరాల్లో పళు్ళ, పూల తోటలు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం భూస్వాముల ఆక్రమణలు ఉన్నాయి. పేద కౌలుదార్లు సాగు చేసుకుంటున్న భూములు ఉన్నాయి. వీటి విస్తీర్ణం తక్కువ. ఎన్ని వేల ఎకరాలు భూములు ఉన్నప్పటికీ వేలాది దేవాలయాలను నిత్య ధూప, దీప, నైవేద్యాది కార్యక్రమాలు నిర్వహించటంలేదు. మాన్యం భూముల నుంచి ఆదాయం ఆలయాలకు అందటంలేదు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా చల్లా కొండయ్య కమిషన్‌ను నియమించారు. దేవాలయ భూములన్నిటినీ మార్కెట్ ధరకు అమ్మి, అలా వచ్చిన సొము్మతో దేవాలయాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులను వ్యతిరేకిస్తూ రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టు `స్టే' మంజూరు చేయటంతో ఈ సిఫార్సులు అటకెక్కాయి. ఆలయ భూములను పేదలకు నివేశన స్థలంగా పంచాలని, ఆ విధంగా వచ్చిన భూమికి వెలకట్టి ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెల్లించాలని 1995లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 29, 1995న జీవో జారీ చేశారు. ఈ జీవోపై కొందరు హైకోర్టుకు వెళ్ళి `స్టే' తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు వెళ్ళింది. కౌలుదారులకు రెండున్నర ఎకరాల మాగాణి, అయిదు ఎకరాల మెట్ట భూమి మించకుండా కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కౌలుదారుకు కేటాయించిన భూమికి మార్కెట్ రేటులో నాలుగింట మూడు వంతులు వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది.